న్యూఢిల్లీ : హెటీరో సంస్థ బుధవారం మార్కెట్లోకి కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’ను విడుదల చేసింది. ఒక ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ రిటైల్ ధర రూ. 59గా నిర్ణయించినట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది.
ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదివరకే కరోనా చికిత్సలో వినియోగించే రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో తమ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఫావిపిరవిర్ ఔషధం క్లినికల్‌గా మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపింది.
ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించి డీసీజీఐ నుంచి అన్ని అనుమతులను పొందినట్టు హెటిరో వెల్లడించింది. హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ ద్వారా ఫావిపిరవిర్ ఔషధం మార్కెటింగ్ చేయబడుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ ఫార్మసీలలో ఈ ఔషధం నేటి నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పింది.
డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే ఈ డ్రగ్‌ను విక్రయించడం జరుగుతుందని తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న ఎక్కువ మంది కోవిడ్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ ఔషధం తోడ్పతుందని పేర్కొంది. దేశంలోని తమ కంపెనీ ఫార్ములేషన్ ఫెసిలిటీలో తయారవుతున్న ఈ డ్రగ్‌కు గ్లోబల్ రెగ్యులేటరీ అధికారులు కూడా ఆమోదించారని వెల్లడించింది.