అంతర్జాతీయం: లెబనాన్ సరిహద్దులో భారత బలగాలు
ఇజ్రాయెల్ వైమానిక దాడులు, దక్షిణ లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ దళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపధ్యంలో, ఈ పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ లోని బ్లూ లైన్ ప్రాంతంలో ఐరాస కార్యాలయంపై దాడులు జరగడం, భద్రతా పరిస్థితులు మరింత క్షీణించడం అనేది అత్యంత ఆందోళనకర పరిణామంగా భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.
భారత ప్రభుత్వం స్పందన
భారత సైనికులు కూడా యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ సౌత్ లెబనాన్ (UNIFIL) లో విధులు నిర్వహిస్తున్న దృష్ట్యా, భారత్ ఇక్కడి పరిస్థితులను పటిష్టంగా పరిశీలిస్తోంది. 900 మందికి పైగా భారత సైనికులు UNIFILలో ఉన్నారు. ఈ తరుణంలో భారత్ వివాదం ప్రాంతీయ యుద్ధంగా మారకుండా ఉండేందుకు సంయమనం పాటించాలని సూచించింది.
భద్రతా పరిస్థితుల ఆందోళన
ఇజ్రాయెల్ సైనిక బలగాలు, దక్షిణ లెబనాన్ ప్రాంతంలో శాంతి పరిరక్షకుల బంకర్స్ పై దాడులు చేసిన సంఘటనలో, పీస్ కీపర్స్ గస్తీ వాచ్ టవర్ నే పేల్చేయడం, రెండు మంది శాంతి పరిరక్షకులు గాయపడటం ఆందోళనకర పరిణామంగా ఉంది. పైగా, కమ్యూనికేషన్ సిస్టంను ధ్వంసం చేయడం, పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది.
ప్రస్తుతం భారతీయులను తరలించే చర్యలు లేవు
భారత విదేశాంగశాఖ ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా ప్రాంతంలోని భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా, పరిస్థితులు ఎలా ఉంటే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.