సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, సినిమారంగంలోనూ సంచలనం సృష్టించాయి. ఇప్పటికే నాగార్జున, కేటీఆర్ లు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించబోతున్నారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకున్నారని, ఆమె ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ ప్రవర్తన వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోషల్ మీడియాను బీఆరెస్స్ దుర్వినియోగం చేస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.