కేరళ: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం కీలక మార్పులు
మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేపట్టింది. కేవలం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే భక్తులను అనుమతించే విధానాన్ని ప్రకటించింది. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా భక్తులు తమ యాత్ర మార్గాన్ని ముందుగా ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ సీజన్‌లో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రోజుకు 80 వేల మందికే దర్శనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంటుంది. గతేడాది మండల పూజల సమయంలో వచ్చిన భారీ రద్దీని గుర్తిస్తూ, ఈ ఏడాది భక్తుల సంఖ్యను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికే దర్శనానికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
ఆలయ దర్శన వేళలు పొడిగింపు
మకరవిళక్కు సీజన్ సమయంలో భక్తులకు అధిక సమయం అందించేందుకు ఆలయ దర్శన వేళలను పొడిగించారు. భక్తులు ఉదయం 3:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇలా రోజుకు 17 గంటలపాటు భక్తులకు దర్శనానికి వీలు కల్పిస్తారు.
భక్తుల సౌకర్యాలపై దృష్టి
ఆన్‌లైన్ బుకింగ్ విధానంతో పాటు, భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ మార్గంలో యాత్రికులు ఎదుర్కొనే సమస్యలపై దృష్టి సారించగా, ముఖ్యంగా పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు, పార్కింగ్ ప్రదేశాల అభివృద్ధి పనులు త్వరలో పూర్తవుతాయని కేరళ ప్రభుత్వం తెలిపింది.
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పందన
కేరళ ప్రభుత్వ ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) పూర్తి సమర్థించింది. ఈ విధానం ద్వారా భక్తులు సురక్షితంగా, సమర్థవంతంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, భక్తుల రద్దీని కంట్రోల్ చేయడంలో ఇది ఒక ముఖ్యమైన మార్గం అవుతుందని టీడీబీ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ అన్నారు. శబరిమల భక్తులకు భద్రతకే ప్రాధాన్యం ఇస్తామని, ఈ నిర్ణయం దానిని మరింత మెరుగ్గా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
గతానుభవాలు
గతేడాది శబరిమల మండల పూజల సమయంలో భక్తుల రద్దీకి తాళలేక దేవస్థానం బోర్డు తీవ్ర విమర్శలకు గురైంది. కనీసం భక్తులకు తగిన వసతులు కల్పించకపోవడంతో కొందరు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరింత సమర్థవంతమైన వ్యూహాలతో, సాంకేతిక సహాయంతో యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.