అమరావతి: దసరా పండుగ మహిళా శక్తికి నిదర్శనం: నారా భువనేశ్వరి
విజయవాడ పున్నమి ఘాట్‌లో జరిగిన నారీ శక్తి విజయోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దసరా పండుగ మహిళా శక్తిని ప్రతిబింబించే పర్వదినమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సతీమణులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఘాట్ విద్యుత్ కాంతుల మధ్య ప్రకాశవంతంగా అలరించింది.
మహిళా శక్తి దేశాభివృద్ధికి కీలకం
నారా భువనేశ్వరి తన ప్రసంగంలో మహిళల విజయాలను ప్రశంసించారు. సాంకేతిక యుగంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారని, వారి విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని తెలిపారు. దేశానికి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా అవతరించడం మహిళా సాధికారతకు మంచి సంకేతమని అన్నారు.
ప్రతి మహిళా శక్తిగా!
“మహిళలు కుటుంబానికి శక్తి, సమాజానికి మార్గదర్శకం,” అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. సాంప్రదాయాలు పాటిస్తూ, కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతూ ప్రతి మహిళ శక్తి స్వరూపిణిగా ఉంటుందని ఆమె అన్నారు. మహిళలు తమ శక్తిని గుర్తించి, ఆ శక్తిని విజయంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
చేనేత వస్త్రాలు దసరా ప్రత్యేకం
దసరా పండుగను చేనేత వస్త్రాలతో జరుపుకోవాలని సూచిస్తూ, చేనేత వస్త్రాలు మన సంస్కృతి సంపద అని భువనేశ్వరి పేర్కొన్నారు. వారానికి కనీసం ఒక్క రోజు అయినా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.
నారీ శక్తి విజయోత్సవంలో నవదుర్గల హారతి
కృష్ణా నదిలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలపై అమ్మవారి 9 రూపాలను ప్రతిష్టించి ఘనంగా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమం మహిళా శక్తిని గౌరవించడానికి ఒక ప్రాముఖ్యతనందిచే వేదికగా నిలుస్తుందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
చంద్రబాబు వెనుక ఉన్న శక్తి భువనేశ్వరి
మహిళా సాధికారతలో ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేస్తూ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ, చంద్రబాబు వెనుక ఉన్న శక్తి భువనేశ్వరేనని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవితతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు పాల్గొన్నారు.