ఆంధ్రప్రదేశ్: ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లాలో పండుగ వేళ దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చి, పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, అత్తా కోడలిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి మూడు గంటల సమయంలో ఇద్దరు మహిళలను కత్తులతో బెదిరించి ఈ అమానుష ఘటన జరిగింది.
దారుణ ఘటన వివరాలు
దుండగులు పేపర్ మిల్లులో రాత్రివేళ విచ్చలవిడిగా తిరుగుతూ, ఇంట్లోని పెద్దాయనపై దాడి చేసి, మహిళలను కత్తులతో బెదిరించి ఈ దుష్కార్యానికి పాల్పడ్డారు. సంఘటన అనంతరం ఆ కుటుంబం చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలు పగలగొట్టడం, అక్కడ కండోమ్ ప్యాకెట్లు లభించడం దుండగుల పక్కా ప్రణాళికలో భాగంగా అనుమానం కలిగించింది.
నిందితుల అరెస్ట్
పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. హిందూపురం త్యాగరాజ్ కాలనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వెనుక చిల్లర దొంగతనాలు చేసే ముఠా ఉందని అధికారులు వెల్లడించారు. వీరిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
ప్రభుత్వ స్పందన
ఈ దారుణంపై సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, హోంమంత్రి అనిత స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టారని ప్రకటించారు. అత్తా కోడలిపై జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన విచారణను వేగవంతం చేసి, 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని మంత్రి సవిత తెలిపారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండటంతో, నిందితులపై మైనర్ చట్టాలు అమలు చేసే అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు.