చంద్రబాబు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన మాట “సంపద సృష్టి.” సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేసి సంపద సృష్టించి, అందరికీ పంచుతామని టీడీపీ నాయకులు అప్పట్లో చెప్పారు. అయితే, ఇప్పుడు మద్యం విధానం ద్వారా ఆ సంపద సృష్టిలో తొలి అడుగు పడినట్టుగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో కొత్త మద్యం విధానం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 3,396 మద్యం షాపుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి, వీటితో దరఖాస్తు రుసుముల రూపంలోనే రూ.1,798 కోట్లు లభించాయి. సగటున ఒక్కో షాపుకు 26 మంది పోటీ పడటం గమనార్హం.
నూతన షాపులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. లాటరీ ద్వారా అవకాశం పొందిన వ్యాపారులు లైసెన్సు ఫీజుల కింద భారీ మొత్తాలు చెల్లించాల్సి ఉంటుంది. నగరాలు, జనాభా, మద్యం వినియోగం లెక్కల ఆధారంగా లైసెన్సు ఫీజులు రూ.2 నుంచి 5 కోట్ల వరకు ఉంటాయి. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఈ ఫీజులు మరింత పెరుగుతాయి.
ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్ల ఆదాయం పొందుతుందని అంచనా. టీడీపీ వర్గాలు దీనిని సంపద సృష్టి పథకానికి సంబంధించిన తొలి విజయంగా ప్రచారం చేస్తున్నాయి.