మహారాష్ట్ర: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రంగం సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక అనంతరం జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల కావడం వల్లే, దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు పై ఆసక్తి నెలకొంది. ప్రజలు అసలైన శివసేన, అసలైన ఎన్సీపీ ఎవరో తేల్చనున్నారు. మొత్తం 6 ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలుస్తాయి. శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక కారణంగా మరాఠా కోటా రిజర్వేషన్ల అంశం, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి.
అసెంబ్లీ సీట్ల ప్రాధాన్యం
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా, ఈ ఎన్నికలు మరాఠా రాజకీయ నాయకత్వంలో ప్రధానమైన పవార్, ఠాక్రే కుటుంబాలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గతంలో అధికారంలో ఉన్నా చీలికల కారణంగా శివసేన, ఎన్సీపీ రెండుగా విడిపోయాయి. ఇప్పుడు ఏక్‌నాథ్ శిందే నాయకత్వంలో ఉన్న శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చినా, శివసేన విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో వెనకబడ్డ బీజేపీకి, గతంలో మహారాష్ట్రలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కీలకంగా ఉన్నాయి.
ఎంవీఏ వర్సెస్ మహాయుతి – ప్రధాన పోరు
ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన – ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ – అజిత్ పవార్) మరియు మహా వికాస్ అఘాడీ (శివసేన – ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ – శరద్ పవార్, కాంగ్రెస్) మధ్య జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ 30 సీట్లను గెలుచుకున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
గత ఐదేళ్లలో కీలక పరిణామాలు
2019లో బీజేపీ, శివసేన పొత్తుతో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. కానీ 2022లో ఏక్‌నాథ్ శిందే శివసేనను విడదీసి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్సీపీలోనూ చీలిక వచ్చింది. అజిత్ పవార్ 40 మంది ఎమ్మెల్యేలతో మహాయుతి కూటమిలో చేరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఈ చీలికల అనంతరం, శివసేన, ఎన్సీపీల అధికారిక హోదా ఏదని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా తేల్చనున్నారు. శిందే, అజిత్ పవార్‌లు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకున్నా, ప్రజా కోర్టులో ఎవరికీ మద్దతుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.