హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు: దక్షిణ కొరియా పర్యటనకు ఎమ్మెల్యేలు
మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఆక్రమణల తొలగింపుపై అభ్యంతరాలు వచ్చినప్పటికీ, ప్రజారోగ్యం, హైదరాబాద్ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి ఖాళీ చేసిన నివాసాల కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసిన అధికార విభాగాలు, నిర్వాసితులను పూర్తిగా ఒప్పించాక తదుపరి చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మూసీ సుందరకీరణపై అధ్యయన పర్యటన
ప్రాజెక్టు విస్తృత అభివృద్ధికి సంబంధించిన అవగాహన కల్పించేందుకు సియోల్‌లోని హన్ నది అభివృద్ధి, సుందరికరణను అధ్యయనం చేసేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్ళనున్నారు. ఈ నెల 19న 21 మంది సభ్యుల బృందం సియోల్ పర్యటనకు బయలుదేరనుంది. అక్కడి నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలను సందర్శించి, నది సుందరికరణలో దక్షిణ కొరియా అనుసరించిన చర్యలను అధ్యయనం చేయనుంది.
బీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు దూరం
మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధతలో ఉన్నారు. పర్యటనకు ఆసక్తి చూపినప్పటికీ, స్థానిక ప్రజల అభ్యంతరాలు, పార్టీ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వెళ్ళడం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. బుధవారం కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం జరగనుంది, ఇందులో మూసీ ప్రాజెక్టుపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది.
పర్యటనకు వెళ్ళే సభ్యుల జాబితా
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ (మంత్రులు), గద్వాల్ విజయలక్ష్మి (మేయర్), మోతె శ్రీలతారెడ్డి (డిప్యూటీ మేయర్), ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి (బీఆర్‌ఎస్), రాజాసింగ్ (బీజేపీ), మహ్మద్ ముబిన్ (ఎంఐఎం) సహా పలువురు అధికారులు పర్యటనలో పాల్గొననున్నారు.