స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వము శుభవార్త అందించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అందింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో, విద్యా రంగంలో పలు కీలక మార్పులను చర్చించారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల అంశాలను వచ్చే వారం చర్చించనున్నారు.
జీవో 117 రద్దు నిర్ణయం
స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు గత ప్రభుత్వం జీవో 117 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జీవో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.
తరగతుల విలీనంపై నిర్ణయం
గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతులను విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ స్థాయిలో ప్రతి మేజర్ పంచాయతీ వద్ద ఒక మోడల్ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నవంబర్‌లో కీలక కార్యక్రమాలు
నవంబర్ 11న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల కార్యక్రమం జరగనుంది. అలాగే నవంబర్ 14న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనే మెగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే రెండు నెలలపాటు ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో భేటీ నిర్వహించి, సమస్యలపై చర్చించనున్నారు.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు
ఉపాధ్యాయ సంఘాలు కొన్ని కీలక అభ్యర్థనలు చేశారు. వారానికి 32 పీరియడ్లకు మించి బోధన విధులు ఉండకూడదని, రెసిడెన్షియల్ శిక్షణను మార్చాలని కోరారు. అంతేకాక, 2017లో టీడీపీ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులు 29, 42, 53లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిధుల విడుదల
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు విడుదల చేసింది. మంత్రి లోకేష్ పాఠశాలలను తనిఖీ చేసిన అనంతరం ఈ నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. పీఎంశ్రీ పాఠశాలలకు రూ.8.63 కోట్లు, కేజీబీవీలలో డైట్ నిర్వహణకు రూ.35.61 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ.8.82 కోట్లు, మిగిలిన 40,728 పాఠశాలలకు రూ.51.9 కోట్లు కాంపోజిట్ గ్రాంట్ల కింద అందించారు.