ముంబై: ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక ప్రకారం భారత్ లో ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ 70 శాతం పడిపోయిందని పేర్కొంది. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 25 నుంచి విధించిన లాక్‌డౌన్, కరోనా భయాలు మరియు అధిక ధరల వంటి అంశాలు డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమని వివరించింది. ‘క్యూ2 పసిడి డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు:
► 2020 (ఏప్రిల్–జూన్) నెలల మధ్య డిమాండ్ 63.7 టన్నులకు పరిమితమైంది, 2019 ఇదే త్రైమాసికం లో పసిడి డిమాండ్ 213.2 టన్నులు ఉంది.
► ఇక ఈ డిమాండ్ విలువ, 57 శాతం పతనమై రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు క్షీణించింది.
► ఇక ఆభరణాల డిమాండ్ విషయానికి వస్తే 74 శాతం తగ్గి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు పరిమితమైంది. విలువలో చూస్తే, 63 శాతం పడిపోయి, రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు చేరింది. పెళ్లిళ్లు పెద్దగా జరక్కపోవడం, జరిగినా అంత ఆర్భాటాలు లేకపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం.
► ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, పరిమాణం డిమాండ్ 56 శాతం క్షీణించి 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు జారింది. విలువల్లో 37 శాతం క్షీణించి 13,040 కోట్ల నుంచి రూ.8,250 కోట్లకు చేరింది.
► పసిడి రీసైకిల్డ్ పరిమాణం కూడా 64 శాతం క్షీణతతో 37.9 టన్నుల నుంచి 13.8 టన్నులకు దిగివచ్చింది. దేశం మొత్తం లాక్‌డౌన్‌తో రిఫైనరీలు మూతపడ్డం దీనికి ప్రధాన కారణం.
► పసిడి దిగుమతులు భారీగా 95 శాతం క్షీణించి 247.4 టన్నుల నుంచి కేవలం 11.6 టన్నులకు పరిమితం.
► కాగా 2020 మొదటి ఆరునెలల్లో భారత్ పసిడి డిమాండ్ 56 శాతం పతనమై 165.6 టన్నులకు క్షీణించింది.