సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ కార్యక్రమంలో మాట్లాడిన నాగబాబు, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. రాజకీయం మాత్రమే కాకుండా, రాజనీతిజ్ఞుడిగా ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి అభివృద్ధికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గుర్తుచేసిన నాగబాబు, ఆ దృష్టికోణం సర్వనాశనం కావడం విచారకరమని అన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్‌గా మార్చడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఆయన పట్టుదల, శ్రమ ఎవరూ మరచిపోలేరని వ్యాఖ్యానించారు.
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబుపై అవాస్తవ ఆరోపణలు చేయడం సులభం అయినా, అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయని నాగబాబు స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం మార్చుకోవడానికి కూటమి ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుతం చంద్రబాబు పై ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాగబాబు, ఇప్పుడు ఆయన విజన్, రాజనీతిజ్ఞతపై ప్రశంసలు కురిపించడం, నాయుడిపై నమ్మకాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.