వైసీపీకి కీలకమైన నాయకుల్లో ఒకరైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్రా ప్రాంతీయ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. 2016 నుంచి 2022 దాకా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఉత్తరాంధ్రలో వైసీపీ విజయాలు సాధించింది.
2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 9 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు మాత్రమే వచ్చాయి. కానీ, విజయసాయిరెడ్డి రాకతో 2019లో 28 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది.
అయితే, 2022లో ఆయనపై వచ్చిన ఆరోపణల కారణంగా ఈ బాధ్యతల నుంచి తొలగించి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. కానీ, 2024 నాటికి ఫలితాలు బాగా తగ్గిపోయాయి. 34 అసెంబ్లీ సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. ఈ నేపథ్యంలో, పార్టీని పటిష్టం చేయాలని జగన్ మళ్లీ విజయసాయిరెడ్డికే పగ్గాలు అప్పగించారు.
విజయసాయిరెడ్డి మళ్లీ బాధ్యతలు స్వీకరించడం వెనుక జగన్ వ్యూహం ఉందని, ఆయన ఉత్తరాంధ్రలో పార్టీని తిరిగి చురుకుదనం, పటిష్టత ఇవ్వగలరని నమ్ముతున్నారు. విశాఖ నుంచే రాజకీయాలు ప్రారంభించిన విజయసాయిరెడ్డి, రానున్న రోజులలో మూడు జిల్లాలో విస్తృతంగా పర్యటించి పార్టీని రీ యాక్టివ్ చేస్తారని విశ్వసిస్తున్నారు.
ఈ నియామకం పట్ల పార్టీ సొంత వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, విజయసాయిరెడ్డి లక్కీ హ్యాండ్ గా వ్యవహరించి విజయం సాధించగలరనే నమ్మకంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి పార్టీకి మద్దతు ఇస్తూ విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరిస్తారో చూడాలి.