జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించిన సంచలన విషయాలను ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయ్‌కి ఏడాదికి రూ. 40 లక్షలకుపైగా ఖర్చు జరుగుతుందని, ఈ డబ్బులు అతడి అవసరాల కోసం వెచ్చిస్తున్నారని లారెన్స్ బంధువు రమేశ్ బిష్ణోయ్ తెలిపారు.
లారెన్స్ కుటుంబం ఆరంభం నుంచి సంపన్న కుటుంబమని రమేశ్ పేర్కొన్నారు. ఆయన తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసేవారని, తమకు గ్రామంలో 110 ఎకరాల భూమి ఉందని చెప్పారు. పంజాబ్ యూనివర్సిటీలో న్యాయవిద్యను పూర్తిచేసిన లారెన్స్, నేరాల బాట పట్టడం తాము ఊహించలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లారెన్స్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో ఉండగానే తన పేరును లారెన్స్ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే లారెన్స్ చెడు బాట పట్టాడు. 2008లో డీవీఏ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేయడంతో నేరాల వైపు పూర్తిగా మొగ్గుచూపాడు.
లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగడానికి మరో కారణం, 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై హత్యా కుట్ర. లారెన్స్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే తన నేర కార్యకలాపాలను నడిపిస్తుండడం గమనార్హం. సింగర్ సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యలకు కూడా లారెన్స్ జైలు నుంచే కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.