జమ్మూకశ్మీర్: దేశంలోనే టాప్ ఫిట్నెస్ సీఎం: ఎవరు అనుకుంటున్నారు?
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఫిట్నెస్తో దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. 54 ఏళ్ల వయసులో కూడా, అతను ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ మారథాన్‌లో 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తి చేయడం విశేషం. ఇది సాధారణ క్రీడాకారులకు సాధ్యమైనా, రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండే సీఎం ఒమర్ అబ్దుల్లా ఇలా పరిగెత్తడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మారథాన్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రత్యేకత:
ఒమర్ తన జీవితంలో ఎప్పుడూ 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తలేదని, ఇప్పుడు 21 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేయడం తనకు చాలా ప్రత్యేకమైన విషయమని చెప్పారు. ఆయన ఈ మారథాన్‌ను కేవలం పూర్తి చేయడమే కాకుండా, ఈ వయసులో కూడా తన ఫిట్నెస్ స్థాయిని నిరూపించారు. అంతర్జాతీయ మారథాన్ నిర్వహణలో యూరప్ మరియు ఆఫ్రికా సహా వివిధ దేశాల నుండి 2,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
జమ్మూ కశ్మీర్ మారథాన్:
ఈ మారథాన్‌ను బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రారంభించగా, జమ్మూకశ్మీర్‌లో మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించడం రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టకరమైన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా, ఇది ప్రపంచంలోని అత్యుత్తమ మారథాన్లలో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజేతలు:
ఈ మారథాన్‌లో పురుషుల విభాగంలో షేర్ సింగ్ 42 కిలోమీటర్ల దూరాన్ని 2.23 గంటల్లో పూర్తి చేసి విజేతగా నిలిచారు. అదే మహిళల విభాగంలో తామసీ సింగ్ 42 కిలోమీటర్ల మారథాన్‌ను 3.03 గంటల్లో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచారు. విజేతలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బహుమతులు అందజేశారు.
ఫిట్‌నెస్‌కు ఆదర్శం:
సాధారణంగా రాజకీయ నాయకులు ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. కానీ ఒమర్ అబ్దుల్లా తన ఫిట్నెస్ లెవెల్స్ తో అందరికీ స్పూర్తిగా నిలిచారు. దేశంలో మరెక్కడా ఇలా ఫిట్‌గా ఉండే ముఖ్యమంత్రి లేరు అని చెప్పడం తగిన మాటే.