ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తిరుమల వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణంగా మారింది. ఈ వివాదంపై తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులకు తాము ఇస్తున్న సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని, రూమ్‌ల సౌకర్యం కూడా కల్పించట్లేదని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్ర రెండూ నా రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఒక కన్ను తొలగించినట్లు వ్యవహరిస్తున్నారా అని తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు తిరుమలలో సమర్థించకపోతే, తెలంగాణ దేవాలయాల్లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రత్యేక దర్శనాలకు అనుమతించేది ఎందుకని ప్రశ్నించారు. తాము పంపిన లెటర్లను తిరస్కరిస్తారా లేదా? లేకపోతే తాము కూడా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణను కేవలం వ్యాపారం చేసుకునే వేదికగా చూడడం సరైంది కాదని అన్నారు.
ఈ వివాదం గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఏపీ ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా ఉండాలని సూచించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.