టొరంటో: కెనడాలోని టొరంటో (Toronto) సమీపంలో జరిగిన టెస్లా కారు దుర్ఘటనలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్‌లోని గోద్రా ప్రాంతానికి చెందిన తోబుట్టువులు కేటా గోహిల్ (30), నిల్ గోహిల్ (26) తమ తోటి ప్రయాణికులతో కలిసి టెస్లా కారులో వెళుతుండగా, కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ దెబ్బకు కారు బ్యాటరీకి మంటలు అంటుకొని, భారీ అగ్ని ప్రమాదానికి దారితీసింది.
ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు.
ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు వారి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించారు.
ఒక 20 ఏళ్ల యువతిని మంటల్లో కాలిపోతున్న కారులో నుండి ఒక వ్యక్తి బయటకు తీయగలిగాడు.
ఆమె ప్రస్తుతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇప్పటికే కెనడా పౌరసత్వం పొందిన మరో భారతీయుడు కూడా ఈ ప్రమాదంలో మరణించడం గమనార్హం.
ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే కారులో (Tesla Electric Vehicle) పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
కెనడాలో ఇటువంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగినాయి.
ఈ ఏడాది జులైలో జరిగిన మరో దుర్ఘటనలో పంజాబ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు హైవేపై కారు బోల్తా పడడంతో మరణించారు.
ఈ సంఘటన భారతీయ సమాజంలో విషాదాన్ని కలిగించడంతో, ట్రాఫిక్ భద్రతపై మరింత అవగాహన కలిగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.