ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ అయిన సంజయ్ మంజ్రేకర్ తనకు తిరిగి టీవీ వ్యాఖ్యాతగా అవకాశం ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు . యూఏఈలో జరగబోయే ఐపీఎల్–13లో వ్యాఖ్యానం చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బోర్డుకు ఈ–మెయిల్ పంపాడు.
‘గౌరవనీయులైన బోర్డు ఉన్నతాధికారులకు మనవి. నేను ఇదివరకే కామెంటేటర్‌గా నాకు స్థానం కల్పించాలని మెయిల్ చేశాను. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కావడంతో బీసీసీఐ.టీవీ త్వరలోనే కామెంట్రీ ప్యానెల్‌ను ఎంపిక చేస్తుంది.
‘ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్న నన్ను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నాను. గతంలో బోర్డు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడంలో పొరపాటు జరిగింది. ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. అలాగే నడుచుకుంటానని తెలియజేస్తున్నాను’ అని మంజ్రేకర్ ఆ ఈ–మెయిల్‌లో పేర్కొన్నారు.
బీసీసీఐ నియమావళికి విరుద్ధంగా బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ రవీంద్ర జడేజాను విమర్శించడంతో కొందరు క్రికెటర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది మార్చిలో మంజ్రేకర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించారు.
కాగా 71 ఏళ్ల భారత దిగ్గజం సునీల్ గావస్కర్ క్రికెట్ వ్యాఖ్యానం కోసం యూఏఈ వెళ్లనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయనకు ఉన్న చోటే వర్చువల్ కామెంట్రీ అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఆటపై ఉన్న ఆసక్తితో నేరుగా కామెంట్రీ చేసేందుకు ఆయన అక్కడికి వెళ్తారని బోర్డు వర్గాలు తెలిపాయి.