అంతర్జాతీయం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా ఖండించిన ఇరాన్, దీనికి ప్రతిస్పందనగా మెరుపుదాడులకు సిద్ధమని హెచ్చరించింది. ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని, దానికి గట్టి బదులిస్తామని ఇరాన్ తస్నిమ్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది.
తాజాగా ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోని ఇరాన్ ప్రావిన్సులపై సైనిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఖుజెస్తాన్, ఇలామ్ ప్రాంతాల్లోని కొన్ని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిమిత నష్టం జరిగినట్లు ప్రకటించింది.
విమాన రాకపోకలపై నిషేధం
ఇజ్రాయెల్ దాడుల దృష్ట్యా, ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసి అన్ని విదేశీ విమానాలను రద్దు చేసింది. ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి ప్రకారం, తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ చర్య ఇజ్రాయెల్‌పై మరింత ప్రతీకార చర్యలకు సంకేతమని అంటున్నారు.
“మళ్ళీ తప్పు చేస్తే తీవ్ర ప్రతిస్పందన తప్పదు”: ఇజ్రాయెల్
ఇరాన్ మీద దాడులు పూర్తయిన తర్వాత, ఇజ్రాయెల్ IDF ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఒక హెచ్చరిక చేశారు. “ఇరాన్ మళ్లీ ఇలాంటి తప్పులు చేస్తే ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది,” అని పేర్కొన్నారు.
క్షిపణి తయారీ కేంద్రాలపై దాడులు
ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, గత ఏడాది ఇరాన్ నుండి ప్రయోగించిన క్షిపణులకు సంబంధించి, అగ్రశ్రేణి క్షిపణి తయారీ ప్లాంట్లు మరియు ఇతర ప్రదేశాలపై వారు దాడులు జరిపారు. ఈ దాడుల్లో తమ విమానాలు సురక్షితంగా తిరిగివచ్చాయని తెలిపారు.