అమరావతి: వైసీపీ హయాంలో జారీచేసిన రహస్య జీవోలను బహిర్గతం చేయడంలో కూటమి సర్కారు కీలక చర్యలు తీసుకుంటోంది. గతంలో టీడీపీ, బీజేపీ నేతలు రహస్య జీవోలపై తీవ్ర విమర్శలు చేస్తూ, న్యాయ పోరాటంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
మొత్తం 320కు పైగా జీవోలు రహస్యంగా ఉంచారనే ఆరోపణలతో కూడిన ఈ వ్యవహారం, అప్పట్లో హైకోర్టులో పిటిషన్లతో నడిచింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని జీవోలు ఆన్లైన్ చేసినప్పటికీ, చాలా వరకు మాత్రం దాచిపెట్టారు.
తాజాగా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం, రహస్య జీవోలను బహిర్గతం చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ, హోం శాఖలకు సంబంధించిన జీవోలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జీవోలను గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ (జీవోఐఆర్) ద్వారా పబ్లిక్ డొమైన్లో ఉంచనున్నారు.
ఈ చర్యతో ప్రజలకు వైసీపీ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలు తెలుస్తాయి. రహస్య జీవోలను బహిర్గతం చేయడం ద్వారా, గత ప్రభుత్వంలో తీసుకున్న వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు ప్రజలకు పూర్తిగా బహిరంగంగా తెలియజేయాలన్నది కూటమి సర్కారు ఉద్దేశం.