హర్యానా: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు చేస్తుండడం, దీనిపై భారత ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ప్రతికూల ఫలితాల సమయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందంటూ ఈసీ విమర్శించింది.
హర్యానా ఎన్నికల్లో ఎటువంటి లోపాలు జరగలేదని స్పష్టం చేస్తూ, ప్రతీ చర్య కాంగ్రెస్ అభ్యర్థులు లేదా ఏజెంట్ల పర్యవేక్షణలోనే జరిగిందని తెలిపింది.
అక్టోబర్ 8న ఫలితాలు వెలువడినప్పుడు అధికారిక వెబ్‌సైట్ అప్‌డేట్ ప్రక్రియ 2 గంటల పాటు ఆలస్యమైనందుకు కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కూడా ఈసీ ఖండించింది.
ఈ మేరకు మొత్తం 1,600 పేజీలతో కూడిన ప్రతిస్పందనను విడుదల చేసింది. ఇలాంటి అనవసర ఆరోపణలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు దారితీస్తాయని హెచ్చరించింది.
హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తొలుత ఆధిక్యంలో ఉన్నా, తర్వాత బీజేపీ విజయం సాధించింది. ఈ పర్యవసానంపై కాంగ్రెస్ అనుమానాలను వ్యక్తం చేస్తూ అక్రమాల ఆరోపణలు చేసింది.
ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను నిరాధారంగా తిప్పికొట్టింది. గందరగోళం సృష్టించేలా నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని, బాధ్యతతో వ్యవహరించాలని కాంగ్రెస్‌ను కోరింది.