ఆంధ్రప్రదేశ్: ‘కుటుంబంపై దిష్టి తగిలినట్లుంది’ – వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ భావోద్వేగ బహిరంగ లేఖ
వైఎస్సార్ అభిమానులకు, తన కుటుంబం మీద జరుగుతున్న అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ, వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె, తన కుటుంబం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, సామాజిక వేదికల ద్వారా ప్రచారం అవుతున్న అసత్యాలు, మరియు తన పిల్లల మధ్య ఉన్న ఆస్తుల వివాదంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.
“జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి”
“నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు,” అని విజయమ్మ అన్నారు. “నా కళ్లముందే జరగకూడనివన్నీ జరుగుతున్నాయి.” వైఎస్సార్ అభిమానులకు, తమ కుటుంబానికి అందరూ అందించిన ప్రేమకుగాను ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ, తాజాగా జరిగిన సంఘటనలు తన హృదయానికి ఎంతటి బాధ కలిగించాయో వివరించారు.
వైఎస్సార్ ప్రేమించే ప్రతి ఒక్కరు తన పిల్లలను కూడా ప్రేమించారు అని చెప్పిన విజయమ్మ, “మీరు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎంతో ప్రేమాప్యాయతతో ఉండేవారు. రాజశేఖర్ రెడ్డికి కూడా మేము ఎంత ప్రేమ ఉందో, మీరు కూడా అంతే ప్రేమతో ఉండేవారు” అన్నారు. వైఎస్సార్‌ను కోల్పోయిన తరువాత, తన పిల్లలను ప్రోత్సహించి ఆదరించారు.
“ఇంటి గుట్టు బయట పెట్టడం బాధాకరం”
“ఇంటి గుట్టు బయట పెట్టడం చాలా బాధాకరం,” అన్నారు విజయమ్మ. అయినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున, తన కుటుంబంపై పుకార్లు, అసత్యాల ప్రచారం ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ, “ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఆయన మన మధ్యనుంచి వెళ్లిపోయాక కూడా, ఆయన స్మృతిలో మీ ప్రేమ ఎప్పటికీ ఉండాలి. కాబట్టి ఈ కుటుంబాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయకండి” అని అన్నారు.
“YSR ఆస్తులు పంచలేదు”
వైఎస్సార్ బతికి ఉండగా ఆస్తులు పంచేశారని చెబుతున్న వారు చెప్పే మాటల్లో వాస్తవం లేదని విజయమ్మ వివరించారు. వైఎస్సార్ తన పిల్లలు జగన్, షర్మిల పేర్లలో కొన్ని ఆస్తులు ఉంచినప్పటికీ, వాటిని పంచడం అని భావించకూడదని అన్నారు.
“ఇప్పుడు షర్మిల పేరు మీద ఉన్న ఆస్తులు, జగన్ పేరు మీద ఉన్నవి రెండూ కుటుంబ ఆస్తులే,” అని వివరించారు విజయమ్మ.
“2019లో కుటుంబ విభజన నిర్ణయం, ఇద్దరికీ తగిన వాటాలు”
2019లో జగన్ ఇజ్రాయిల్ పర్యటనలో కుటుంబ ఆస్తుల విభజన అంశం తలెత్తింది. “జగన్ తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, ఇద్దరి ఆస్తులను వేరు చేయాలని సూచించారు. ఆ తర్వాత విజయవాడలో, నేను కూడా పాల్గొన్న సమావేశంలో, ఆస్తులను ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం” అని విజయమ్మఅన్నారు .
“అన్నా చెల్లెళ్లు పరిష్కరించుకుంటారు
తల్లి హోదాలో తాను మాట్లాడుతున్నట్టు విజయమ్మ చెప్పారు. “ఈ సమస్య అన్నా చెల్లెళ్ల మద్యన పరిష్కారం వస్తుందని నాకు నమ్మకం ఉంది,” అని వివరించారు. “రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఈ వివాదం ఉండేది కాదు,” అని ఆమె నొక్కి చెప్పారు.
ఆఖరులో, “రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దయచేసి మా కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువగా మాట్లాడవద్దు. మా కుటుంబంపై ఉన్న ప్రేమను మీరెవ్వరూ అసత్యాలతో తక్కువ చేయవద్దు,” అని అన్నారు.