కర్ణాటక: కన్నడ నటుడు దర్శన్‌కు తాత్కాలిక ఊరట
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలుకెళ్లిన ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. దర్శన్ వెన్నెముక సమస్య కారణంగా వైద్య చికిత్స పొందాలనే కారణంతో ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. విచారణ కోర్టులో పాస్‌పోర్ట్ సమర్పించడం, చికిత్స వివరాలు, ఆరోగ్య నివేదికను వారంలోగా సమర్పించడం వంటి షరతులతో బెయిల్‌ను మంజూరు చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన దర్శన్
అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబరు 21న సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన దర్శన్, తన వెన్నెముక శస్త్ర చికిత్స కోసం బెయిల్ కోరగా, సెషన్స్ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. దర్శన్ తరపున న్యాయవాది సీవీ నగేశ్, బళ్లారి సెంట్రల్ జైలు వైద్యుల నివేదికలు, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రి న్యూరాలజీ విభాగాధిపతి సమర్పించిన ఆరోగ్య నివేదికలను కోర్టులో సమర్పించారు. తదనంతరం స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ వాదనలు వినిపించారు. వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్న అనంతరం, హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
“దర్శన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేశారు”
దర్శన్ తరపున న్యాయవాది సునీల్ కుమార్ మాట్లాడుతూ, “దర్శన్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరాం. కోర్టు ఆమోదంతో ఆరు వారాల పాటు బెయిల్‌ను మంజూరు చేసింది. అనుమతినీ యితర షరతుల ప్రకారం ట్రయల్ కోర్టులో పాస్‌పోర్ట్‌ను సమర్పిస్తాం. కోర్టు ఆదేశాలు వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. వెంటనే దర్శన్ ఆస్పత్రిలో చేరుతారు, ఆరోగ్య నివేదికను కోర్టుకు సమర్పిస్తాం,” అన్నారు.
కేసు నేపథ్యం
2024 జూన్ 11న రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టయ్యారు. ఈ కేసులో, అతని స్నేహితురాలు పవిత్రగౌడతో సహా మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి, కరెంట్ షాకులు పెట్టి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్, బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు తరలించబడ్డారు.