ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఐదేళ్ల సమీకృత గ్రీన్ ఎనర్జీ విధానం అమల్లోకి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉండే సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం (AP Integrated Clean Energy Policy 2024)ని నోటిఫై చేసింది. ఈ నూతన విధానంలో సౌర, పవన, హైబ్రీడ్, మినీ హైడ్రో ప్రాజెక్టుల నుంచి మొదలుకుని గ్రీన్ హైడ్రోజన్, బయో ఇంధనాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విడుదల చేశారు.
9.5 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి లక్ష్యం
రాష్ట్రంలో వివిధ సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులకు అనేక అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2024 ఆగస్టు నాటికి ఏపీ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం 9.5 గిగావాట్లకు చేరినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల్లో సౌర, పవన, హైబ్రీడ్, మినీ హైడ్రో, బ్యాటరీ స్టోరేజీ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి వనరులు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి పై పెద్దగమ్యం
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 39 ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి 74.9 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ఉత్పత్తి 43.89 గిగావాట్ల వరకు సాధ్యమవుతుందని తెలిపింది. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు.
3,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ ఉత్పత్తి – నూతన లక్ష్యాలు
బ్యాటరీ స్టోరేజీ ద్వారా 25 గిగావాట్ల మేర విద్యుత్ నిల్వ చేయడం, ఏడాదికి 1.50 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. అదనంగా, రోజుకు 10,000 టన్నుల సీబీజీ, సీఎన్‌జీ వంటి బయోఫ్యూయెల్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5,000 మెగావాట్ల బ్యాటరీ తయారీ, 3,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రం సిద్ధమవుతుందని వివరించారు.