కడప: వైసీపీ నేతల నుంచి తమ నాయకురాలికి ప్రాణహాని ఉందని, ఈ నేపథ్యంలో మరింత భద్రత కల్పించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు ప్రస్తుతానికి 2+2 భద్రత ఉన్నప్పటికీ, తన ఆస్తుల వివాదం నేపధ్యంలో వైసీపీ నేతల వ్యతిరేకతతో ఆమెకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు లేఖ రాసి, షర్మిలకు 4+4 భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ దీనిపై సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే, భద్రత పెంపుపై ప్రభుత్వ ఆమోదం అవసరం ఉండడంతో, తుద నిర్ణయం ప్రభుత్వం అనుమతితోనే ఉంటుందని భావిస్తున్నారు.
దీంతోపాటు, షర్మిల తనకు తెలంగాణలో కూడా భద్రత కొనసాగించాలని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుకు కాంగ్రెస్ నేతలు పంపిన లేఖలో షర్మిలకు ప్రస్తుతం ఉన్న వై కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా, వైసీపీ నేతలు షర్మిలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వ్యతిరేక ప్రచారం నిర్వహించడం తో ఆమె భద్రతను పెంచడం అవసరమని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించి, భద్రత విషయంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరుతున్నారు.