తెలంగాణలో మద్యం విక్రయాలలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రతిరోజూ లక్షల లీటర్ల మద్యం అమ్ముడవుతున్నాయనీ, గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు పెరిగాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) తాజా నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర ప్రజలు సగటున ఒక్కో వ్యక్తి రూ.1,623 ఖర్చు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో రూ.1,306 ఖర్చు చేస్తున్నారని అంచనా వేసింది.
ప్రస్తుత డేటా ప్రకారం, దసరా సందర్భంగా తెలంగాణలో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దాదాపు రూ.1,000 కోట్ల విలువైన మద్యం అమ్ముడవ్వడం రికార్డుగా నిలిచింది.
ప్రత్యేకంగా 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్లు వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, 1,000కి పైగా బార్లు, పబ్స్ ఉన్నాయి.
సర్వే ప్రకారం, బీర్ల వినియోగంలో కూడా తెలంగాణ ముందంజలో ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్ల అమ్మకాలు జరిగినట్లు డేటా తెలిపింది. ఈ విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం చేరిందని అంచనా వేయబడింది.