అమెరికా: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పై దృష్టి సారిస్తూ వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’ సదస్సులో పాల్గొన్న లోకేష్, ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న ఆహ్వానాన్ని పలువురు సంస్థలకు అందించారు.
అమెరికాలోని అట్లాంటాలో నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించడం ఈ పర్యటనలో మరో విశేషం. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా లోకేష్, అమెరికాలోని ఎన్నారైలపై ప్రశంసలు కురిపించారు. ఎవరెవరినైనా “ఎన్ఆర్ఐలు” అంటున్నప్పటికీ, తాను మాత్రం వారిని “మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (MRI)” గా సంబోధిస్తున్నానని తెలిపారు.
ఎన్నారైలు ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళినా, వారందరి ఆలోచనలు ఏపీ అభివృద్ధి పట్లే ఉండటం హర్షణీయం అన్నారు. రానున్న రోజుల్లో ఎన్‌ఆర్ఐల భాగస్వామ్యంతో ఏపీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న ధ్యేయాన్ని లోకేష్ వ్యక్తం చేశారు.
తన పాదయాత్రలో జనసమస్యలపై మాట్లాడి ఇచ్చిన హామీలను గుర్తుచేసిన లోకేష్, ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిన అరాచకాలు, అవినీతి పై తీవ్రంగా స్పందించారు. “రెడ్ బుక్” విషయాన్ని ప్రస్తావిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో తాము వెనకడుగు వేయమని అన్నారు.