ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఆయన, ఈరోజు అనకాపల్లి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉన్నా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటనతో పర్యటనను రద్దు చేశారు.
ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం నుంచి అనకాపల్లికి హెలికాఫ్టర్‌లో బయలుదేరి, 11.15కు చింతలగోరువాని పాలెంలోని లారస్ సంస్థ వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం పాల్గొని, స్థానిక పారిశ్రామిక వర్గాల అభివృద్ధి పరిస్థితులపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12.20కు వెన్నెలపాలేనిలో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.25కి రుషికొండకు వెళ్లి అక్కడి ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. ఈ సందర్శనలో ఆయన పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేస్తారని సమాచారం. అనంతరం 2.30కి విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై, జిల్లాలోని ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ఈ పర్యటన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొత్త ఉద్వేగం తీసుకురావడం విశేషం.