తెలంగాణ బీఆర్ఏస్: రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తనదైన శైలిలో ఓటర్ల నమోదు ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
వీరు పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ పరిచయాల ద్వారా ఓటర్ల నమోదుపై ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే, ఈసారి బీఆర్ఎస్‌లో మాత్రం పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఆశించినంత చురుకైన ప్రదర్శన కనిపించడం లేదు. సొంత పార్టీ నేతలు సైతం ఈ పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు పట్టభద్రుల ఎన్నికలను పట్టించుకోకపోవడం, టికెట్ ఆశించే నేతలు కూడా నిర్లిప్తంగా ఉండటంతో కీలక అవకాశాలను వదులుకుంటున్నారన్న భావన వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ముందుకెళ్తుండగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ ఎన్నికల్లో పోటీపై కేసీఆర్ మదిలో ఏముందన్నదే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నేతల నిశ్శబ్దం ఆ పార్టీ భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతుందా లేదా అన్నది చూడాలి.