ఏపీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విద్యుత్ చార్జీల పెరుగుదలపై కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె ప్రజలకు ఈ పెరుగుదల ఒక “కరెంట్ షాక్”గా మారిందని, గత వైసీపీ ప్రభుత్వ పాపాల బరువు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను ప్రజలపై వసూలు చేయడం సరైనది కాదు. గత ప్రభుత్వంలో అనాలోచితంగా తీసుకున్న విద్యుత్ కొనుగోలు నిర్ణయాల భారం ఇప్పుడు ప్రజల నెత్తిన పడుతోంది.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధిక చార్జీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రజలకు ఊరట కల్పించకుండా అదనపు భారం మోపడం తగదని” షర్మిల అన్నారు.
వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు కూటమి కూడా అదే బాటలో నడుస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఇది తట్టుకోవడం చాలా కష్టమవుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందని షర్మిల స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన ఆమె, అధిక విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.