తెలంగాణ: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై వివరణ ఇవ్వాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ, తెలంగాణలో యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాలకు ఆరు గ్యారెంటీలను, 420 హామీలను ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని, ఇప్పుడు అవి అమలు చేయకుండా తెలంగాణలో అడుగు పెట్టడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు.
పార్టీ నేతలు దేశంలో స్వేచ్ఛగా తిరగవచ్చని చెప్పినప్పటికీ, ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, యువత, మహిళలు, రైతులు వంచించబడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే రాహుల్ గాంధీ తెలంగాణ యాత్ర చేపట్టాలంటే, మొదటగా ఈ హామీలపై సమాధానం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.