ఆంధ్రప్రదేశ్: ఏపీ కేబినెట్ కీలక భేటీ- మరో భారీ పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నవంబర్ 6న సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి మరింత అభివృద్ధి తీసుకువచ్చే పలు ప్రధాన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగనున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు, ముఖ్యమైన ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ భారీ పెట్టుబడులు
ప్రపంచ ప్రఖ్యాత స్టీల్ దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వీరు సన్నద్ధమవుతున్నారు. బుధవారం జరిగే కేబినెట్ భేటీలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో 63,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడి
ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో అమలు చేయాలని ప్రతిపాదించింది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి నాలుగేళ్ల కాలంలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశ ద్వారా 20 వేల మందికి ఉపాధి దొరకనుంది. 2029 జనవరి నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యేలా యత్నిస్తున్నారు.
రెండో దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడి పెట్టి స్టీల్ ప్లాంట్ పనులను 2033 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. దీనిద్వారా మరో 35 వేల మందికి ఉపాధి కల్పిస్తారని కంపెనీ తన ప్రతిపాదనలో పేర్కొంది.
క్యాప్టివ్ పోర్టు నిర్మాణం
ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌తో పాటు కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టును కూడా అభివృద్ధి చేయాలని మిట్టల్ సంస్థ ప్రతిపాదించింది. ఇది పరిశ్రమలకు మరింత మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.
భూమి కేటాయింపు
ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం నక్కపల్లి మండలంలో 2164.31 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. ఈ భూమిలో భాగంగా ఏపీఐఐసీకి చెందిన భూములు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ నివేదిక అందించారు. ఈ ప్రతిపాదనలను ఏపీ కేబినెట్‌లో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇది ఏపీకి పరిశ్రమల పునరుద్ధరణలో కీలక ముందడుగు కావొచ్చు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందించనుంది.