ఆంధ్రప్రదేశ్: ఏపీలో మహిళలపై వరుస లైంగిక దాడులు చోటు చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో మహిళల రక్షణపట్ల రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోజా మాట్లాడుతూ, “రాష్ట్రంలో మహిళలు అసురక్షితంగా జీవిస్తున్నారు. కేవలం 120 రోజుల్లో 110 లైంగిక దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. మహిళలపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒక స్కూల్ అమ్మాయి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేయబడిన దారుణ ఘటనపై ఆమె ప్రభుత్వాన్ని నిందించారు. ఈ ఘటనలపై స్పందించాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.
మరో వైపు, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. “పవన్ కల్యాణ్ గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మహిళల అదృశ్యంపై ఆరోపణలు చేసినప్పటికీ, ఇప్పటికీ ఆ మిస్సింగ్ కేసుల్లో ఒక్కరిదైనా కనుగొనగలిగారా?” అని ప్రశ్నించారు. “రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని పవన్ అన్నారు, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?” అని పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
పవన్, లోకేష్ వంటి నాయకులు మహిళల భద్రతపై పట్టించుకోవటం లేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.