అమెరికా: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తాడు అని ముందుగానే చాలా రకాల ఊహాగానాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించింది. ఇక భారతదేశంలో కూడా ఆ జోరు గట్టిగానే కనిపించింది. మొన్నటివరకు ఊహించని నష్టాలు ఎదురవ్వగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు భారీ లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం లాభాలతో ప్రారంభమై రోజంతా అదే ఊపును కొనసాగించింది. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా పెరిగి 80,569.73 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సూచీ 24,500కు చేరువగా నిలిచింది.
ఐటీ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 4 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు సూచీలను మద్దతుగా నిలిచాయి. ట్రంప్ విజయం దిశగా సాగుతుండటంతో, డాలర్ ఇండెక్స్ బలపడింది.
దీంతో ఐటీ రంగంపై పరిస్థితులు సానుకూల ప్రభావం చూపించాయి. అమెరికా కరెన్సీలో ఎక్కువగా ఆదాయం రాబడుతున్న ఈ కంపెనీలకు డాలర్ బలపడడం లాభదాయకమైంది అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ ఒక్కరోజులోనే రూ.8 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం రూ.452 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మదుపర్లకు మంచి సంపదను చేరవేయడం ద్వారా సానుకూలతను తీసుకువచ్చింది. అంతర్జాతీయంగా కూడా ట్రంప్ విజయావకాశాలు ఎక్కువ కావడం పలు మార్కెట్లపై మిశ్రమ ప్రభావాన్ని చూపించింది.
భారత మార్కెట్లు లాభాల్లో రాణిస్తుండగా, ట్రంప్ పాలనలో చైనాపై ఉన్న సుంకాల భయంతో హాంకాంగ్, షాంఘై మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ట్రంప్ విజయం ఆసక్తికర పరిణామాలకు దారితీస్తుందని ట్రేడర్లు భావిస్తున్నారు.