భీమవరం: వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) శాఖ అధికారులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి దాడులు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోని శ్రీనివాస్ నివాసంతో పాటు, ఆయనకు చెందిన ఆక్వా వ్యాపారాల సముదాయాలు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి.
గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామి చెన్ను లక్ష్మణరావు నివాసంపై కూడా ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.
దాడుల వెనుక, పన్ను ఎగవేత కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, వ్యాపారాల ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నారు. ఈ తనిఖీలలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఈ చర్యకు రాజకీయ కోణం ఉండవచ్చని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ దాడులు చర్చనీయాంశంగా మారాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ వంటి నాయకుడిపై దాడులు జరగడం వెనుక కుట్ర ఉందని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులతో వైసీపీ నాయకులు అలెర్ట్ అయ్యారు, కొందరు సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.