ట్రంప్ అమెరికా అధ్యక్షుడవ్వడానికి ప్రేరణ
2011 ఏప్రిల్ 30 – వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ విందు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా విందులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ప్రసంగంలో ఉన్నట్టుండి, వ్యాపారవేత్తగా పేరుపొందిన డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయన టీవీ షోల గురించి వ్యంగ్యంగా ప్రస్తావించారు. ‘‘బికినీలు వేసుకున్న అమ్మాయిలతో షోలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో హాజరవుతారా!’’ అంటూ ట్రంప్‌ను వ్యంగ్యాస్త్రాలతో ఎగతాళి చేశారు. ఒబామా ట్రంప్‌ను ఇలా విమర్శించడానికి గల కారణం ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలే. అధ్యక్ష ఎన్నికల సమయంలో, ట్రంప్ ఒబామా గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒబామా అమెరికాలో జన్మించలేదు, కెన్యాలో పుట్టాడు, అందువల్ల అధ్యక్ష పదవికి అర్హుడు కాడు’’ అనే ఆరోపణలు ట్రంప్ మోపినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. ఒబామా వ్యంగ్యాస్త్రాలపై ఆ విందులో అతిథులు ఎగతాళిగా నవ్వుతుండగా, ట్రంప్ మాత్రం తన తలవంచుకొని ఉండిపోయారు. ఈ అపమానం ట్రంప్‌కు జీవితాన్ని మార్చే నిర్ణయాన్ని ఇచ్చింది – అమెరికా అధ్యక్ష పీఠం చేరాలని కృతనిశ్చయానికి వచ్చారు.
ట్రంప్ ఎదుగుదల: కుటుంబ వ్యాపారానికి కొత్త పుంతలు
న్యూయార్క్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఫ్రెడరిక్ ట్రంప్, మేరీ దంపతుల నాలుగో సంతానం అయిన డొనాల్డ్ ట్రంప్, క్వీన్స్‌లో జన్మించారు. పాఠశాల రోజుల్లో ప్రవర్తన సరిగా లేకపోవడంతో 13 ఏళ్ల వయసులో సైనిక అకాడమీలో చేరారు. సైనిక క్రమశిక్షణ, తండ్రి నుంచి విజయ సూత్రాలు నేర్చుకోవడం, ట్రంప్ వ్యక్తిత్వాన్ని బలపరిచాయి. 1968లో వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్‌లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పొంది, తండ్రి నుంచి 10 లక్షల డాలర్ల అప్పుతో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. బ్రూక్లిన్, క్వీన్స్‌లో మాత్రమే ఉన్న వ్యాపారాన్ని మన్‌హట్టన్‌కు విస్తరించారు. ఫిఫ్త్ అవెన్యూలోని ‘ట్రంప్ టవర్’ వంటి ప్రాజెక్టుల ద్వారా తన బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.
ప్రముఖ టీవీ షో – ‘ది అప్రెంటీస్’
2003లో ఎన్‌బీసీ ఛానల్‌లో ప్రసారమైన ‘ది అప్రెంటీస్’ టీవీ షోలో పాల్గొని ప్రజాదరణ పొందిన ట్రంప్, ప్రజా జీవితంలో మరింతగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా అభ్యర్థులను తన సంస్థలోనే నియమిస్తూ రియాలిటీ టీవీ ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.
అధ్యక్ష పీఠంపై కన్ను
రాజకీయాలపై ట్రంప్ ఆసక్తి 1988 నుంచే మొదలైంది. 2000లో రిఫార్మ్ పార్టీ అభ్యర్థిగా ఒకసారి పోటీ చేయగా, 2015లో రిపబ్లికన్ పార్టీ తరపున ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో అధికారికంగా తన ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా బలమైన అమెరికాను నిర్మిస్తానని హామీ ఇచ్చి, రిపబ్లికన్ పార్టీలోనే విజయం సాధించి 2016లో హిల్లరీ క్లింటన్‌పై గెలిచారు.
వ్యక్తిగత నియమాలు
ట్రంప్ మద్యం, డ్రగ్స్, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం విశేషం. ఆయన అన్నయ్య ఫ్రెడ్, మద్యం కారణంగా జీవితాన్ని కోల్పోవడంతో, ట్రంప్ అలా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఆయన తన పిల్లలతోకూడా చాల కఠినంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
2024 ఎన్నికల్లో మరో విజయం
2024లో మరోసారి ట్రంప్, తన ప్రత్యర్థి కమలా హారిస్ పై దూకుడుగా ప్రచారం చేసి, శక్తివంతమైన నాయుకుడిగా ప్రజలలో తన పాత్రను ప్రదర్శించారు. అక్రమ వలసలు, ఆర్థిక స్థిరీకరణ వంటి ప్రధాన అంశాలపై తన స్థిరమైన వాగ్దానాలతో ప్రజల మద్దతు పొందారు.