దిల్లీ: తేలికపాటి మోటారు వాహనాల (ఎల్‌ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సుతోనే వాణిజ్య రవాణా వాహనాలను నడపడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం వెలువరించిన ఈ కీలక తీర్పులో, ఎల్‌ఎంవీ లైసెన్సుతో గరిష్ఠంగా 7.5 టన్నుల బరువు వరకు ఉన్న వాణిజ్య వాహనాలను నడపవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనికోసం మరొక ప్రత్యేక లైసెన్సు అవసరం లేదని, మోటారు వాహన చట్టం (ఎంవీఏ) ప్రకారం చట్టబద్ధత కల్పించింది. చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఇప్పుడు ఎల్‌ఎంవీ లైసెన్సుతో తక్కువ బరువున్న వాణిజ్య వాహనాలను నడుపుకోవచ్చు. అయితే, అపాయకరమైన రసాయనాలు, మందుగుండు సామగ్రిని కలిగిన వాహనాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది.
తీర్పు ముఖ్యాంశాలు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్ర పాల్గొన్నారు. 126 పేజీల తీర్పులో తేలికపాటి వాహనాలను నడపడంలో బీమా కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను, వ్యాపార రంగంపై ప్రభావాన్ని వివరించారు.
2017లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, ఈ రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. త్రిసభ్య ధర్మాసనం అప్పట్లో, 7.5 టన్నుల బరువుకు మించని రవాణా వాహనాలను ఎల్‌ఎంవీ నిర్వచనంలో మినహాయించవద్దని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై బీమా కంపెనీలు 76 పిటిషన్లు దాఖలు చేస్తూ, ఎల్‌ఎంవీ లైసెన్సుతో వాణిజ్య వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు, బీమా చెల్లింపుల భారం పెరుగుతుందని వాదించాయి.
సుప్రీం కోర్టు అభిప్రాయం
పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం, దేశంలో రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలున్నాయని, ఇలాంటి వాదనలకు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. డ్రైవర్ల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని, మోటారు వాహన చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది.
ఇక మోటారు వాహన చట్ట సవరణల ప్రక్రియ కొనసాగుతోందని, భవిష్యత్తులో చోదకుల్లేని వాహనాల వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా చట్టాలను సవరించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.