జాతీయం: దాతృత్వానికి పెద్దపీట వేసిన శివ్ నాడార్
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా 2024 దాతృత్వ జాబితా విడుదల
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా 2024 అత్యధిక దాతల జాబితాలో మరోసారి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. సుమారు రూ.2,153 కోట్ల విరాళాలను అందిస్తూ, శివ్ నాడార్ తన దాతృత్వంతో మిగతా ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా నివేదిక ప్రకారం, ముకేష్ అంబానీ, బజాజ్ కుటుంబం, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
శివ్ నాడార్, ఆయన కుటుంబం ఈ ఏడాదిలో గరిష్ట విరాళాన్ని అందించారు. శివ నాడార్ ఈ టైటిల్‌ను మూడోసారి అందుకున్నారు. ఆయన విరాళాల సగటును లెక్కగడితే.. ఆయన ప్రతిరోజూ రూ.5.9 కోట్లు విరాళంగా ఇచ్చారు.
అత్యధికంగా విరాళం ఇచ్చిన మహిళగా రూ. 154 కోట్లు విరాళంగా ఇచ్చిన 65 ఏళ్ల రోహిణి నీలేకని ఉంటే అతి పిన్న వయస్కుడు జీరోధాకు చెందిన నిఖిల్ కామత్ ఉన్నారు.
- శివ్ నాడార్: శివనాడార్ ఫౌండేషన్ ద్వారా శివ నాడార్ విద్య, కళల ప్రోత్సాహం కోసం రూ.2,153 కోట్ల విరాళాన్ని అందించారు. గత ఏడాది కంటే 5% అధికంగా ఈ సారి విరాళాలు ఇచ్చారు.
- ముకేష్ అంబానీ: రూ.407 కోట్లతో రెండో స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత వంటి విభాగాల్లో సహాయాన్ని అందించారు.
- బజాజ్ కుటుంబం: మూడో స్థానంలో రూ.352 కోట్ల విరాళం అందించిన బజాజ్ కుటుంబం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రధానంగా దృష్టి పెట్టారు.
- గౌతమ్ అదానీ: రూ.330 కోట్ల విరాళంతో ఐదో స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ, విద్య, నైపుణ్యాభివృద్ధికి తన కృషిని అందించారు.
- కుమార్ మంగళం బిర్లా కుటుంబం: రూ.334 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఈ కుటుంబం విద్య, మహిళా సాధికారత, ఆరోగ్యం, క్రీడల అభివృద్ధికి దోహదం చేసింది.
ఇక ఈ జాబితాలో ఉన్న టాప్ 10 దాతలు సమిష్టిగా రూ.4,625 కోట్ల విరాళాలను సమాజానికి అందించారు. ఇందులో ఎక్కువ మంది విద్యారంగానికి ప్రధానంగా విరాళాలను కేటాయించారు. ఈసారి ఎడెల్‌గివ్ హురున్ ఇండియా జాబితాలో మొత్తం 203 మంది వ్యాపారవేత్తలు ఉంటే, వారిలో 96 మంది మొదటిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
టాప్ 10 దాతృత్వవేత్తలు (2024):
- శివ్ నాడార్ – రూ.2,153 కోట్లు
- ముకేష్ అంబానీ – రూ.407 కోట్లు
- బజాజ్ కుటుంబం – రూ.352 కోట్లు
- కుమార్ మంగళం బిర్లా – రూ.334 కోట్లు
- గౌతమ్ అదానీ – రూ.330 కోట్లు
- నందన్ నీలేకని – రూ.307 కోట్లు
- కృష్ణ శివుకుల – రూ.228 కోట్లు
- అనిల్ అగర్వాల్ – రూ.181 కోట్లు
- సుస్మిత, సుబ్రొతో బాగ్చీ – రూ.179 కోట్లు
- రోహిణి నీలేకని – రూ.154 కోట్లు
ఈ జాబితా ముఖ్యాంశాలు:
- భారత వ్యాపారవేత్తలు సుమారు రూ.8,783 కోట్లు విరాళంగా అందించారని, ఇది గత రెండేళ్ల కంటే 55% అధికంగా ఉంది.
- 18 మంది వ్యాపారవేత్తలు ఏటా రూ.100 కోట్లకు పైగా విరాళాలు అందిస్తున్నారు.
- రూ.20 కోట్లకు పైగా విరాళాలు అందించిన వారి సంఖ్య 61కి చేరింది, ఇది 2019తో పోలిస్తే 128% అధికం.
ఈ సమాచారంతో భారతీయ దాతృత్వం పట్ల గౌరవం మరింత పెరుగుతుందని, ఇది సమాజం, విద్యాభివృద్ధికి అత్యంత ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు.