ముంబై : భారత్ లో పెద్దదైన టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ అన్నీ ఆలస్యం అవడం తదితర కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది.
సంస్థాపరమైన ఖర్చులను తగ్గించుకునే క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపుగా 1500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్టిఇ 4జీ పరికరాల కొత్త ఆర్డర్లు ఆలస్యం కావడంతో సంస్థ సంక్షోభంలో చిక్కుకుందని పరిశ్రమ వర్గాలు అంచనాకి వచ్చాయి.
అలాగే చైనా నుంచి ఆర్డర్లను తీసుకోవడం కూడా ఆగిపోయి ఉండవచ్చని అంచనా. దీనికితోడు మే నెలలో 22 టెలికాం సర్కిల్స్ ను 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు ప్రస్తుత త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. ఏజీఆర్ మొత్తం బకాయిలు చెల్లిస్తే..తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనీ, ఈ క్రమంలో ఈ చెల్లింపులకు ఇరవై ఏళ్లు సమయం కావాలని సంస్థ ఇటీల సుప్రీంకోర్టును కోరింది.
ఈ క్రమంలో ఇప్పటిలో కోలుకునే పరిస్థితి లేనందువల్ల సంస్థ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐతే అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన కంపెనీ నుండి వెలువడలేదు.