రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసుల షాక్ ఇస్తూ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు. వివరాలలోకి వెళితే..
మద్దిపాడు: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు వర్మపై ఈ కేసు నమోదుచేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా బ్రాహ్మణిని కించపరిచే విధంగా వర్మ తన సినిమా “వ్యూహం” ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
ఐటీ చట్టం కింద దర్యాప్తు ప్రారంభం
టిడిపి నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా ఆయన వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ అభ్యన్తరకరమైన పోస్టులు చేశారు. వైసిపి పట్ల అనుకూలతతో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ, అయన సినిమాలలో చంద్రబాబును నెగెటివ్ క్యారెక్టర్‌గా చూపించిన సందర్భాలున్నాయి.
సోషల్ మీడియాలో కఠిన చర్యలు
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి కార్యకర్తలు కూడా జుగుప్సాకరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేయడంతో ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
రామ్ గోపాల్ వర్మ దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ పోలీసుల చర్యలపై వర్మ రియాక్షన్ కోసం సినీ, రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి.