న్యూ దిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. గవర్నర్‌గా నియమితులైనందుకు ముందు నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన విషయం తెలిసిందే.
సీజేఐగా జస్టిస్ ఖన్నా తన విధులు ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం మే 13వ తేదీ వరకు ఆరు నెలల పాటు నిర్వర్తించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ మూడు రోజుల క్రితం పదవీ విరమణ చేయగా, ఆయన తన తరువాతి సీజేఐగా జస్టిస్ ఖన్నా పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ అక్టోబర్ 24న అధికారికంగా నోటిఫై చేసింది.
ప్రమాణ స్వీకార అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దేశంలోని ప్రముఖులు, న్యాయవర్గాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా న్యాయపరంగా దేశంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో కీలక భూమిక పోషిస్తారని ఆశిస్తున్నారు.