ఏపీ: కూటమి సర్కారు సూపర్ సిక్స్ పథకాల అమలులో వేగం పెంచింది. పెన్షన్ల పెంపు, దీపం పథకం వంటి ముఖ్య పథకాల అమలు మొదలుపెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి రంగం సిద్ధం చేస్తోంది.
ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సుకత నెలకొంది. తాజాగా, ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ ఏడాదిలోనే అమలు చేయబోతున్నట్టు మంత్రి పార్థ సారధి వెల్లడించారు. అంటే వచ్చే 40 రోజుల్లో ఈ పథకం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం సూపర్ సిక్స్ హామీల్లో రెండు ప్రధాన హామీలను అమలు చేస్తోన్న ప్రభుత్వం, ఇతర పథకాల కోసం కూడా నిధులు కేటాయించింది. పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన ప్రభుత్వం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. దీని కోసం రూ. 840 కోట్లు కేటాయించారు.
తాజా బడ్జెట్‌లో అమ్మకు వందనం పథకానికి రూ.6,485 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతి పథకానికి వచ్చే ఏడాదిలో నిధులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక సమస్యల వల్లే రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి ఆరోపించారు. అప్పటికీ, కూటమి ప్రభుత్వం ప్రజలకు కట్టుబడి ఈ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.