ఢిల్లీ వేదికగా హీటు పుట్టుస్తున్న తెలంగాణ రాజకీయం
న్యూ ఢిల్లీ: తెలంగాణలోని కీలక నేతల ఢిల్లీ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారాయి. కొంచెం అటూ-ఇటూగా ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేటీఆర్, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీలో వెళ్లారు. ఈ పరిణామం వివిధ రాజకీయ ఊహాగానాలకు దారితీస్తోంది. తెలంగాణలో కుంభకోణాల ఆరోపణలు ప్రస్తుతం జాతీయస్థాయిలోకి తీసుకెళ్లడం, ముగ్గురు ప్రముఖుల ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపు తెస్తుందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి, అమృత్ పథకంలో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. టెండర్లను రద్దు చేసి, విచారణ చేపట్టాలని సూచించారు. టెండర్లు అక్రమంగా రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో అవినీతిని కేంద్రంలో ఉంచి ఎండగడతామని, దీనికోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ రావడానికి సిద్ధమని కేటీఆర్ హెచ్చరించారు.
ఇదే సమయంలో, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దీపావళి తర్వాత మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాక, తెలంగాణలో కేటీఆర్ చేసిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలపై తాము సుదీర్ఘ పోరాటం చేస్తామని రేవంత్ ఢిల్లీలో ప్రతిపక్ష నేతలతో భేటీ అవుతారన్న అంచనాలు ఉన్నాయి.
ఇక, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ పయనం మరింత చర్చనీయాంశమైంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణలో కీలక వ్యక్తులను ప్రశ్నించేందుకు అనుమతులు ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరినట్లు సమాచారం. ఈ కేసులో కేటీఆర్ పేరు వినిపించడం కూడా రాజకీయం వేడెక్కిస్తోంది. ఈ విషయంపైనే గవర్నర్ ఢిల్లీ వెళ్లారా లేకపోతే సాధారణ రివ్యూ కోసం వెళ్లారా అన్న అంశంపై చర్చ కొనసాగుతోంది.
ఢిల్లీ పర్యటనలో ముగ్గురు కీలక నేతలు ఉన్నందున, తెలంగాణ రాజకీయాలలో ఎప్పుడు ఏమిజరుగుతోందో అనే ఆసక్తి పెరుగుతోంది.