బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదులుతుండడంతో దాని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
ఆల్పపీడన ప్రభావంతో నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచనలున్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వానలు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. వాతావరణం పంటలకు ప్రతికూలంగా ఉండడంతో వరి కోతలను వాయిదా వేయాలని అధికారులు రైతులకు సూచించారు.
తెలంగాణ పరిస్థితి
తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లుడి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
హైదరాబాద్ వెదర్
హైదరాబాద్‌లో పాక్షిక మేఘావృత ఆకాశం, ఉదయపు వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఈశాన్య తూర్పు దిశలో గంటకు 4-8 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి.