బతుకమ్మ కుంటలో ఇక కూల్చివేతలు ఉండవు అని స్పష్టం చేసిన హైడ్రా చీఫ్ రంగనాథ్.
హైదరాబాద్: హైడ్రా చీఫ్ రంగనాథ్ అంబర్ పేటలో బతుకమ్మ కుంటను సందర్శించి, కుంట పునరుద్ధరణపై స్థానికులతో చర్చించారు. 1962 రికార్డుల ప్రకారం 16.13 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ కుంట ఆక్రమణల కారణంగా ప్రస్తుతం కేవలం 5.15 ఎకరాలకు కుదించుకుపోయిందని ఆయన వివరించారు.
బతుకమ్మ కుంటలో ఉన్న నివాసాలను ఇకపై కూల్చబోమని, ఆక్రమిత స్థలాల్లోని ఖాళీ ప్రదేశాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, హైడ్రా చర్యలు పారదర్శకంగా ఉంటాయని హామీ ఇచ్చారు.
రంగనాథ్ మాట్లాడుతూ, హైడ్రా కారణంగా నగరంలో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని జరుగుతున్న ప్రచారం అసత్యమని, వాస్తవానికి రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హైడ్రా ప్రక్రియపై ప్రజలు అపోహలు పెంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు.