ఢిల్లీ: ప్రపంచంలోనే బెస్ట్ సెక్యూరిటీ కలిగిన ఫోన్లలో యాపిల్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి దిగ్గజ కంపెనకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక హెచ్చరిక జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
యాపిల్ ఐఫోన్‌లు, మ్యాక్‌లు, యాపిల్ వాచీలు వాడుతున్నవారికి ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ఇంకా టీవీఓఎస్, విజన్ఓఎస్, సపారీ బ్రౌజర్లకు సంబంధించిన పాత వెర్షన్లు కూడా ఈ ముప్పును కలిగి ఉండవచ్చని వివరించింది.
యాపిల్ పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లను వాడుతున్న యాపిల్ డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించామని, వీటి కారణంగా డివైజ్‌లలో డేటా ప్రైవసీకి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ప్రకటించింది.
అలాంటి పాత వెర్షన్లు వాడుతుంటే హై రిస్క్ ఉందని హెచ్చరించింది. పాత సాఫ్ట్‌వేర్ వాడుతున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తులు చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చని సెర్ట్-ఇన్ తెలిపింది.
ముఖ్యంగా ఐఓఎస్ 18.1 కంటే పాత వెర్షన్లు లేదా 17.7.1 వెర్షన్ ఉన్న ఐఫోన్లు, ఐప్యాడ్ఓఎస్ 18.1 కంటే పాతవైన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్ఓఎస్ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్ ఓఎస్ 11 కంటే పాత సాఫ్ట్‌వేర్ ఉన్న యాపిల్ వాచీలలో ఈ సమస్యను కలిగి ఉండవచ్చని తెలిపింది.
యాపిల్ ఇప్పటికే ఈ సమస్యను గుర్తించి, కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ల ద్వారా పరిష్కారం చూపిందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పాత సాఫ్ట్‌వేర్ వాడుతున్న యాపిల్ వినియోగదారులు తక్షణమే తమ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.