తెలంగాణ: పోలీసులు చెప్పింది వాస్తవం కాదు – నరేందర్ రెడ్డి హైకోర్టుకు పిటిషన్
లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆయనపై ఉన్న ఆరోపణలు అసత్యమని, పోలీసులు కావాలనే తనను అక్రమంగా కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు పోలీసులు తనను బలవంతంగా కారు ఎక్కించారని, వికారాబాద్ డీటీసీకి తీసుకువెళ్లి, తన స్టేట్‌మెంట్ తీసుకోకుండానే కొన్ని పేపర్లపై సంతకం తీసుకున్నారని అన్నారు.
ఈ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముఖ్య నేతల అదేశాల మేరకు తప్పుడు ఆరోపణలతో తనపై చర్యలు చేపట్టారన్నారు.
ఇదే సందర్భంలో పోలీసులు నరేందర్ రెడ్డి 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, దీనిపై విచారణ సోమవారం జరగనుంది.
మరోవైపు లగచర్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలతో నరేందర్ రెడ్డి సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
లగచర్ల కేసులో తాను నేరపూరిత చర్యకు పాల్పడలేదని, బొమరాస్‌పేట్ స్టేషన్‌లో నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టుకు వివరించారు.
ఈ ఘటనలో సురేష్, మహేశ్‌లకు లగచర్లలో భూములు లేవని, పోలీసులు అందజేసిన నివేదికల్లో ఇది స్పష్టమైంది.
పూర్తి దర్యాప్తు..
పోలీసులు ఈ కేసులో సాక్ష్యాలు సేకరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నరేందర్ రెడ్డితో కేటీఆర్ పలుమార్లు మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు పేర్కొన్నారు.
అదనపు ఆధారాల కోసం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్‌ను సీజ్ చేసి, ఫోన్‌ను తెరవడానికి మేజిస్ట్రేట్ అనుమతి కోరారు. అలాగే, నరేందర్ రెడ్డి కస్టడీపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది.
విచారణలోనూ సహకరించని నరేందర్ రెడ్డి
నరేందర్ రెడ్డి, పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు “తెలియదు”, “సంబంధం లేదు” అంటూ ముక్తసరి సమాధానాలు ఇచ్చారని సమాచారం.
ఈ కేసులో పోలీసులు నరేందర్ రెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించి, చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ వ్యవహారంపై కొడంగల్ కోర్టు వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు, ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేశారు.