ఆంధ్రప్రదేశ్: ఏపీలో పెట్రేగిపోతున్న కుక్కల దాడులు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీధికుక్కల బెడద మితిమీరింది. చిన్నారులు, మహిళలు వీధుల్లో భయపడుతూ తిరుగుతున్నారు.
ఏటా వేగంగా కుక్కల సంఖ్య పెరుగుతుండగా, స్థానికంగా నిత్యం ఎన్నో దాడులు జరుగుతున్నాయి.
ఇటీవల పెనుగంచిప్రోలు గ్రామంలో ఏడాదిన్నర వయస్సున్న బాలుడు ప్రేమ్‌కుమార్‌పై కుక్కల దాడి చోటుచేసుకుంది. అతడిని కుక్కలు తీవ్రంగా గాయపరచగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, బాలుడు మృతి చెందాడు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో 3,003 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 3,881 మంది వీధికుక్కల దాడులకు గురయ్యారు.
చిన్నారులపై దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిమాణంలో దాడులు కొనసాగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 49,000 వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో పలు గ్రామాల్లో వీధికుక్కల దాడులు పెరిగాయి. వీటికి వ్యాధి నిరోధక టీకాలు, కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC) తక్షణమే చేపట్టాలనే డిమాండ్లు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
జిల్లా, మున్సిపల్ అధికారులు ఏకకాలంలో ఈ చికిత్సలు చేయడం ద్వారా సమస్యను నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ మున్సిపాలిటీలో ఏబీసీ శస్త్రచికిత్సలు, యాంటీ రాబిస్ టీకాలు నిర్వహిస్తున్నప్పటికీ వీధికుక్కల సంఖ్య 2019 లో 13,000 నుంచి ప్రస్తుతం 30,000 వరకు చేరుకుంది.
చికిత్సలు కొన్ని నెలలుగా సక్రమంగా కొనసాగకపోవడంతో వీటిలో సంతానోత్పత్తి పెరుగుతోంది.
ప్రజల భద్రత కోసం అధికారులు తక్షణమే వీధికుక్కల నియంత్రణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అంతేకాకుండా, ప్రతి నెలా సుమారు 900 కేసులు విజయవాడ జీజీహెచ్‌కు వస్తుండగా, బాధితులకు వైద్యులు ఇంజక్షన్లు ఇస్తూ చికిత్స అందిస్తున్నారు.
మరింత ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడితే, ఈ సమస్యకు సమాధానం దొరకవచ్చని స్థానికులు అంటున్నారు.