తెలంగాణ: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అమృత్ పథకం కుంభకోణం ఆరోపణలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా చానల్‌తో మాట్లాడిన ఆయన, ఖట్టర్‌ను కేటీఆర్ కలవలేదని, అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా, బయట నుంచే తిరిగి పంపించివేశారని తెలిపారు.
ఖట్టర్ కార్యాలయం పీఏతో మాట్లాడిన తర్వాతే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని కొండా స్పష్టం చేశారు. ఒకవేళ ఖట్టర్‌ను కేటీఆర్ కలిసే ఉంటే ఫొటోలు విడుదల చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతలెవరినీ కలవలేదని, ఆయన కలిసింది కాంగ్రెస్ నేతలని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.
ఇక, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌పై అభియోగాలు మోపాలని భావించినా, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వారిని అడ్డుకుంటోందని కొండా పేర్కొన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.