ఏపీ: సోషల్ మీడియా వేదికగా దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలను హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ చర్చలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయడం జరుగుతుందని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. మహిళలను, కుటుంబాలను అవమానించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
“ప్రతీ ఒక్కరికీ న్యాయంగా, పారదర్శకంగా ట్రీట్‌మెంట్ ఉంటుంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వారు ఎవరైనా ఉపేక్షించబడరు” అని అన్నారు.
వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతల కుటుంబాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గతంలో సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించిన చంద్రబాబు, తాము అధికారంలో ఉన్నప్పుడే సీరియస్‌గా వ్యవహరిస్తామని చెప్పారు.
కూటమి నేతలకే కాకుండా తమ పార్టీలోని ఎవరికైనా ఈ నిబంధన అమలవుతుందని, అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీ సభ్యులకు, కార్యకర్తలకు సోషల్ మీడియా వేదికను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో స్ఫూర్తి తీసుకుని నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని అన్నారు.